ఏపీలో ఇప్పుడు హై అలర్ట్... కలసికట్టుగా ఎదుర్కొందాం: మంత్రి నారా లోకేశ్

 


  • మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
  • జీరో క్యాజువాలిటీ లక్ష్యంతో సహాయక చర్యలు ముమ్మరం
  • 19 జిల్లాల్లో 40 లక్షల మందిపై ప్రభావం అంచనా
  • సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది ప్రజల తరలింపు
  • రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
  • అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకొస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా "జీరో క్యాజువాలిటీ" లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తుపాను సన్నద్ధతపై ఆయన వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలోని 19 జిల్లాల్లో దాదాపు 40 లక్షల మంది ప్రజలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదకర ప్రాంతాల్లోని 1,238 గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,906 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. ముఖ్యంగా 3,465 మంది గర్భిణులు, బాలింతలను గుర్తించి, వారిని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

ముందస్తు చర్యల్లో భాగంగా 14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, వాటిలో 364 పాఠశాలలను తుపాను షెల్టర్లుగా మార్చారు. అక్టోబర్ 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బోటింగ్, బీచ్‌లలో పర్యాటకంపై పూర్తి నిషేధం విధించినట్లు లోకేశ్ వెల్లడించారు.

సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది, బోట్ బృందాలు, చెట్లను తొలగించే బృందాలను లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ పరికరాలతో సిద్ధం చేశారు. అత్యవసర వైద్య సేవలకు 325 మెడికల్ క్యాంపులు, 876 ఆరోగ్య తక్షణ స్పందన బృందాలు, 108, 104 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. మూడు బోట్ క్లినిక్‌లను కూడా క్రియాశీలకం చేశారు.

తుపాను అనంతరం విద్యుత్ పునరుద్ధరణ కోసం 772 బృందాలను 11,347 స్తంభాలు, 1,210 ట్రాన్స్‌ఫార్మర్లతో సిద్ధంగా ఉంచారు. రహదారులపై అడ్డంకులను తొలగించడానికి 7,289 యంత్రాలు, తాగునీటి సరఫరాకు 1,521 ట్యాంకర్లు, 1,037 జనరేటర్లు ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు, 10 మొబైల్ నెట్‌వర్క్ టవర్లను (COWs) కీలక ప్రాంతాల్లో మోహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్మీ, ఎన్డీఎంఏ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ వివరించారు.

ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ఈ విపత్తును అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

Vision Pro

Welcome to the era of spatial computing.

Macbook Pro

Mind-blowing. Head-turning.

Airpods Pro

Adaptive Audio. Sound that adapts to you.

iPad Air

Light. Bright. Full of might.