రాష్ట్రం వైపు వేగంగా కదులుతున్న 'మొంథా' తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుపాను సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, ప్రజలకు అండగా నిలవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తుపాను కారణంగా ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3,000 అందించాలని ఆదేశించారు. దీంతో పాటు, ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, వైద్య శిబిరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మనం చేపడుతున్న సహాయక చర్యలు భవిష్యత్తులో వచ్చే తుపానులను ఎదుర్కోవడానికి ఒక రోల్ మోడల్‌గా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
